శ్రీదీపిక

బుధవారం, జులై 25, 2007

 

సలామ్‌ కలామ్‌!

ఇది ఆంధ్రజ్యోతి లో ౨౫ జూలై నాడు  వచ్చ్చిన సంపాదకీయం

'నా దేశానికి మార్గదర్శకత్వం వహించు. కఠోరశ్రమతో లక్ష్యా లను సాధించే లక్షణాన్ని ఇవ్వు' అంటూ కలలబేహారి కలాం మన ఉజ్వల భవిష్యత్తుకోసం భగవంతుడిని వేడుకున్నారు. కలలు కనడం, వాటికోసం కఠోరదీక్షతో శ్రమించడం ఆయన లక్ష ణం. ఈ దేశంలోని ప్రతి ఒక్కరికీ, అటువంటి లక్ష్యాలూ, లక్షణా లూ ఉండాలని ఆయన కలలు కన్నాడు. అస్త్రాలు తయారుచేసినా, స్వప్నాలలో సైతం ఊహించని అధ్యక్షపదవిలో ఉన్నా, ఆయన ఆలోచన, ఆచరణ 'ఆమ్‌ ఆద్మీ' (సగటు మనిషి) కోసమే. ఆయన ఆవేశం, తపన అభివృద్ధికోసమే. అధినేతల ప్రసంగాలు ఆలోచనలనూ, అంతరాంతరాల్లో ఆవే శాన్నీ రేకెత్తించే సందర్భాలు చాలా తక్కువ. గొంతునుంచే తప్ప గుండెలోతుల్లోంచి రాని మాటలు మన మనసులను స్ప­ృశిం చవు. అభివృద్ధి గురించి మాట్లాడినా, ప్రగతి ఫలాలు అందరికీ అందాలన్నా, అట్టడుగు వారి గురించి ఆలోచించమని చెప్పినా వారి మాటల్లో ఏదో తెలియని వెలితి. మాటకారితనమే తప్ప మనసుకరిగిన దాఖలాలు అగుపించవు. విచిత్రమేమంటే, వారం తా ప్రజలమధ్య, ప్రజలకోసం జీవిస్తున్నవారు. ప్రజల సమస్యలు తెలిసినవారు.

ప్రజలద్వారా అధికారాన్ని అందిపుచ్చుకున్నవారు. అటువంటి వారి మాటల్లో అగుపించని ఆర్ద్రత, ఆవేశం, ఆప్యా యత ఈ అణుపితామహుడిలో ఎట్లా కనిపిస్తున్నాయి? అణ్వస్త్ర బాధ్యతలైనా, అధ్యక్ష బాధ్యతలైనా ఆయనకు ఒక్కటే. రణరంగ మైనా, రాష్ట్రపతి భవన్‌ అయినా ఆయన దృష్టిలో ఒక్కటే. నిత్య కృషీవలుడికి క్షేత్రంతో నిమిత్తంలేదు. వారి పనికి పరిమితులూ, పగ్గాలూ ఉండవు. తాను చేస్తున్న పనిని అమితంగా ప్రేమిం చడం, దానితో తాదాత్మ్యం చెందడం ఆయన లక్షణం. అందరూ తనలాగే ఉండాలని ఆకాంక్షించడం ఆయన అమాయకత్వం. ఆయన అదుపులో లేని ఒక బలహీనత. మొఘల్‌ గార్డెన్స్‌లో రంగురంగుల గులాబీలను చూసి మైమరిచిపోతూనే, పరిమళం లేనప్పుడు ఎంత గొప్ప గులాబీ అయినా ప్రయోజనం ఏముం టుంది అని వాపోవడం ఆయనకే చెల్లు. అంతఃసౌందర్యం లేన ప్పుడు బాహ్యసౌందర్యం ఉన్నా ప్రయోజనం ఏమిటన్న ఆయన ప్రశ్న తన తోటమాలిని అడిగినది కాదు. ఆ ప్రశ్న మనందరికీ ఆయన సంధించినది.

ఐదేళ్ళక్రితం ఆయన అధ్యక్షుడైనప్పుడు ఆయన కేశసౌంద ర్యంపై అద్భుతమైన చర్చ జరిగింది. అధ్యక్షుడు ఆ విధంగా ఉండ వచ్చునా? అన్న అనుమానాన్ని నివృత్తి చేయడానికి ఆయన ప్రయత్నించలేదు. కానీ, రాష్ట్రపతి అంటే రథాలూ, రాచరికపు మర్యాదలూ అన్న భావనను ఆయన తుడిపేశారు. అధ్యక్షభవ నాన్ని అందరికోసం తెరిచారు. ఆయన పదవీకాలంలో అధ్యక్ష భవనాన్ని సందర్శించిన ఆమ్‌ ఆద్మీ సంఖ్య దేశ చరిత్రలోనే సరి కొత్త రికార్డు. దేశవ్యాప్తంగా పర్యటించి సుమారు పదిలక్షలమంది పిల్లలతో మాట్లాడిన ఘనత ఆయనదే. పాతికేళ్ళ తరువాత రైలె క్కిన రాష్ట్రపతి ఆయనే. అధ్యక్షభవనంలో ఆయన ఏర్పాటు చేసిన సమావేశాలకు లెక్కలేదు. పెద్దలతోనైనా, పిల్లలతోనైనా ఎన్ని గంటలైనా అదే చిరునవ్వుతో, అంతే ఉత్సాహంతో ముచ్చటించే ఓపికా, సహనం ఆయనకు ఉన్నాయి.

సీనియర్‌ సిటిజెన్లనుంచి నెటిజెన్లవరకూ అందరినీ ఆకర్షించగలిగే సమర్థత, ఆవేశం, ఆయా అంశాల్లో అభినివేశం ఆయనకు ఉన్నాయి. అందుకే, నువ్వు పెద్ద య్యాక ఏం కాదలుచుకున్నావ్‌? అన్న ప్రశ్నకు ఎదురుగా ఉన్న స్కూలుపిల్ల ఎంత ఉత్సాహంగా ఆయనకు సమాధానం చెప్పిం దో, 'ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఏం చేయాలి?' అంటూ ఆయన యాహూ ఇండియా ఆన్సర్స్‌లో ప్రశ్నించినప్పుడు కూడా 30 వేల మంది అంతే ఉత్సాహంగా తక్షణం స్పందించారు. తమ అనుమానాలను నివృత్తి చేయమంటూ అంతరిక్షంనుంచి అమె రికా-భారత్‌ సంబంధాల వరకూ అనేక అంశాలపైన ప్రతి రోజూ వందలాది మెయిల్స్‌ వచ్చిపడుతుంటే, తన ల్యాప్‌టాప్‌ ముందు గంటలకొద్దీ కూచుని వాటన్నింటికీ స్వయంగా సమాధానాలు రాసే ఓపిక ఆయన స్వంతం. ఆయన ప్రసంగం మధ్యలో మైకు దాటి వేదిక మధ్యలోకి వచ్చే యవచ్చు.

విజన్‌ గురించి వివరిస్తూ వేదికమీద కూర్చుం డిపోవచ్చు. భవిష్యత్తు గురించి విద్యార్థులను వాకబు చేస్తూ భద్రతను పక్కనబెట్టి వారితోపాటే నడుస్తూ పోతుండవచ్చు. ఏదో తెలియని ఆవేశం, ఎనిమిదిపదుల వయసులో కూడా ఇంకా చేయాలనే తపన ఆయనను యువకుల మధ్య యువకుడిగానే ఉంచుతున్నాయి. అందుకే, యూరోపియన్‌ యూనియన్‌ పార్ల మెంటు కొలువుతీర్చి ఉన్న స్ట్రాస్‌బర్గ్‌లో ఇంటర్నేషనల్‌ స్పేస్‌ యూనివర్సిటీ విద్యార్థులకు 2020 నాటికల్లా భారతదేశం అభి వృద్ధిచెందిన దేశంగా ఎలా అవతరించబోతున్నదో వివరించి చెప్పి నప్పుడు 93 దేశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు మంత్రిం చినట్టుగా విన్నారు.

1998 మేలో రాజస్థాన్‌ ఎడారిలో జరిపిన అణువిస్ఫోటనంతో భారతదేశం అణ్వస్త్రదేశంగా అవతరించిన తీరునుంచి గత రెండు దశాబ్దాలుగా ఇస్రో జరిపిన ప్రయోగా లనూ, వాటి ప్రయోజనాలనూ తేదీలతో సహా ఏకరువుపెడు తూంటే అధ్యక్షుడుగా అవతరించిన ఈ అణ్వస్త్రశాస్త్రవేత్త జ్ఞాపక శక్తినీ, తపననూ చూసి ఆశ్చర్యపోకుండా ఎలా ఉంటారు? అంత రిక్ష ప్రయోగాల గురించే కాదు, అధ్యక్షభవనంలోని అశ్వాల గురించీ, రౌతుల కుటుంబాల గురించీ కూడా ఆయన అదే స్థాయిలో వివరించిచెప్పగలరు. ఆయన జిజ్ఞాసకు హద్దులు లేవు. ఉత్సాహానికి ఎల్లలు లేవు. కలాం నిత్యస్వాప్నికుడు, గొప్ప దార్శనికుడు. బలమైన భారత దేశాన్ని కాంక్షించిన ఆయన నిరంతరం అందుకోసం తపించారు. తాను ప్రశ్నించేవారు, ప్రశ్నించాల్సిందిగా ప్రోత్సహించేవారు.

ప్రశ్న లేనిదే మనుగడలేదనీ, ఫలితం రాదనీ బోధించేవారు. కలలు కననిదే మార్గం తెలియదనీ, కండకరగదనీ వాదించేవారు. కఠోరశ్రమతో సుదృఢమైన భారతదేశాన్ని నిర్మించాలన్నది ఆయన తపన. తాను చెప్పదల్చుకున్నదానిని నిర్భయంగా, నిర్మొహ మాటంగా చెప్పగలగడం ఆయన స్వభావం. ఎదుటివారినుంచి తాను ఆశించిన స్పందన రావాలని కోరుకోవడం ఆయన బల హీనత. విజన్‌ 2020 గురించి ప్రతిచోటా నిస్సంకోచంగా మాట్లా డేవారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణసౌకర్యాలను కల్పించే 'పురా' ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి స్పందన లేనప్పుడు దాని సంగ తేమైంది? అని ప్రధానిని నిలదీయగల సాహసం ఆయనకు ఉంది.

లాభదాయకపదవుల బిల్లును తిరగ్గొట్టినా, సర్వోన్నత న్యాయ స్థానంలో నియమితులు కాబోతున్న న్యాయమూర్తుల జాబితాపై పెదవివిరిచినా ఆయనకే చెల్లు. 'పురా' ఆలోచన నుంచి 'బీమారు' రాష్ట్రాల దౌర్భాగ్యస్థితి వర కూ, మతరాజకీయాలనుంచి మానవత వరకూ ఆయన ఏం మాట్లాడినా దానికి అమితమైన విలువ ఉండటానికి కారణం ఆయన మాటలు గుండెగొంతుకలోంచి వస్తాయి కనుకనే. చేత లకూ, మాటలకూ పొంతన ఉంటుంది కాబట్టే. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్‌ దాకా సాగిన ఆయన ప్రస్థానం పదవీవిరమణ అనంతరం మేలిమలుపు తిరగబోతున్నందుకు అభినందనలు.




కామెంట్‌లు: కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]





<< హోమ్

ఆర్కైవ్‌లు

జులై 2007   ఆగస్టు 2007   సెప్టెంబర్ 2007   నవంబర్ 2007   డిసెంబర్ 2007   అక్టోబర్ 2014  

This page is powered by Blogger. Isn't yours?

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి పోస్ట్‌లు [Atom]


Visitors